రైతులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్‌ – తెలంగాణ రైతు సంఘం, జమ్మికుంట

Share the news

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ రైతుల ఆకాంక్షలను నేరవెర్చే విధంగా లేదు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని, వ్యవసాయరంగానికి, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చామని ఘనంగా ప్రకటించి ఆచరణలో మాత్రం రైతుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేయలేదు.

దేశవ్యాప్తంగా రైతాంగం డిమాండ్‌ చేస్తున్న స్వామినాథన్‌ కమిటీ చేసిన సిపార్సులు అమలు, ముఖ్యంగా సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు (సి2 ఖర్చు)కు 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, కేరళ తరహా రుణవిమోచన చట్టం అమలు చేయాలని, ఏక కాలంలో రుణమాఫీ అమలు చేయాలని రైతాంగం కోరుతున్నారు. రైతుల ఆత్మహత్యల పరంపర ఆపేందుకు ఏ ఒక్క ప్రతిపాదన ఈ బడ్జెట్‌లో లేదు.

మద్దతు ధరలు అమలు చేయకపోవడం వల్ల ఏటా దాదాపు రూ.3 లక్షల కోట్లను రైతులు నష్టపోతున్నారు. కొత్తగా ఎఫ్‌పిఓలను ముందుకు తీసుకురావడం ద్వారా కార్పోరేట్లకు వూతం ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నది. దీనికోసం కొత్త బడ్జెట్‌లో రూ.500 కోట్లు కెటాయించారు. గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్న ప్రభుత్వం ఆచరణలో గ్రామీణా ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచడంలో విఫలమైంది.

మార్కెట్‌ ధరల స్థిరీకరణ నిధికి 2019-20 బడ్జెట్‌లో మొదట రూ.3000 కెటాయించి సవరించిన బడ్జెట్‌లో దీన్ని రూ.2010 కోట్లకు తగ్గించారు. కొత్త బడ్జెట్‌లో ఈ కెటాయింపును రూ.2000 కోట్లకు పరిమితం చేశారు.

ఈ నేపథ్యంలో రైతులకు అరకొరగా నిర్ణయిస్తున్న మద్దతు ధరలు కూడా లభించడం ప్రశ్నార్థకరంగానే కొనసాగుతుంది. ఎన్నికల ముందు ఎంతో ప్రచారం చేసిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి మొదట రూ.75000 కోట్లు కెటాయించి సవరించిన బడ్జెట్‌లో రూ.54370 కోట్లకు కుదించారు. కొత్త బడ్జెట్‌లో రూ.75000 కోట్ల కెటాయింపు చూపారు.
ఎంతో ప్రచారం చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు 2019-20లో రూ.3500 కోట్లు కెటాయించి సవరించిన బడ్జెట్‌లో రూ.2032 కోట్లకు తగ్గించారు. కొత్త బడ్జెట్‌లో దీన్ని రూ.4000 కోట్లకు పెంచినట్లు చూపించారు. వ్యవసాయ మార్కెటింగ్‌కు 2019-20లో రూ.600 కోట్లు కెటాయించిన సవరించి బడ్జెట్‌లో దీన్ని రూ.331 కోట్లకు తగ్గించారు. కొత్త బడ్జెట్‌లో దీనికి రూ.490 కోట్ల కెటాయింపుగా చూపించారు. హరిత విప్లవానికి మొత్తంగా 12,560 కోట్లను కెటాయించి, సవరించిన 2019-20 బడ్జెట్‌లో రూ.9965 కోట్లకు కుదించారు. కొత్త బడ్జెట్‌లో దీనికి రూ.13319 కోట్లను చూపించారు. రాష్ట్రీయ కిసాన్‌ యోజనకు మొదట కెటాయించిన రూ.3745 కోట్లను రూ.2745 కోట్లకు తగ్గించారు.

మొత్తం కేంద్ర వ్యవసాయ పథకాల కెటాయింపును రూ.1,30,485 కోట్లుగా చూపి సవరించిన బడ్జెట్‌లో రూ.1,01,904 కోట్లకు కుదించారు. కొత్త బడ్జెట్‌లో దీన్ని రూ.1,34,399 కోట్లుగా చూపించారు. గోదాములు, పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మించడం అంటే ప్రైవేట్‌ వ్యక్తులకు దారదత్తం చేయడమే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రాధాన్యతను కొత్త బడ్జెట్‌ ద్వారా గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచుతున్నామని మభ్య ప్రచారాన్ని అర్థం చేసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ప్రజలందరి దృష్టికి తీసుకొస్తుంది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి రైతుల ఆకాంక్షలు నేరవెర్చే విధంగా చూడాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేస్తున్నది. లేని యెడల దేశవ్యాప్త ఉద్యమానికి రైతులు సన్నదమౌతామని హెచ్చరిస్తున్నది.

మిల్కూరి వాసుదేవ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks